Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 63

Viswamitra and Menaka !!

|| om tat sat ||

పూర్ణేవర్ష సహస్రేతు వ్రతస్నానం మహామునిమ్ |
అభ్యాగచ్ఛన్ సురాస్సర్వే తపః ఫలచికీర్షవః ||

’"వేయి సంవత్సరములు వ్రతము పూర్తి అయిన పిమ్మట స్నానము ఒనర్చిన మహామునికి తపస్సుయొక్క ఫలముని ప్రసాదించుటకై దేవతలందరూ విచ్చేసిరి"

బాలకాండ
అఱువది మూడవ సర్గము

శతానందుడు విశ్వామిత్రుని కథ కొనసాగించెను.

' ఓ రామా ! వేయిసంవత్సరములు వ్రతము పూర్తి అయిన పిమ్మట స్నానము ఒనర్చిన విశ్వామిత్రునికి తపస్సుయొక్క ఫలమును ప్రసాదించుటకై దేవతలందరూ విచ్చేసిరి. అప్పుడు మహాతేజస్వి అయిన బ్రహ్మ రుచికరమైన వచనములతో విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. " నీకు భద్రము అగు గాక . నీవు స్వార్జితమైన శుభమైన కర్మలు ఆచరించి ఋషిత్వము పొందితివి". ఈ విథముగా చెప్పి దేవతల అధిపతి అయిన బ్రహ్మ మరల వెళ్ళిపోయెను. మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు మరల మహాతపస్సును కొనసాగించెను.

'ఓ నరశ్రేష్ఠా ! పిమ్మట కొంతకాలమునకు అప్సరస అయిన మేనక ఆ పుష్కరములో స్నానము చేయ సాగెను. అప్పుడు మహాతేజోవంతుడైన కుశికాత్మజుడు అప్రతిమమైన రూపము గల , నీటిలో విద్యుత్కాంతివంటి ఆ మేనకను చూచెను. మోహవశుడైన ఆ ముని ఆమెను చూచి ఇట్లు పలికెను. "ఓ అప్సరసా నీకు స్వాగతము. ఐక్కడ నా ఆశ్రమములో ఉండుము. నీకు భద్రము అగుగాక | మోహపరవశుడనైన నన్ను అనుగ్రహించుము".

'ఇట్లు చెప్పబడిన ఆ అప్సరస మేనక ఆ ఆశ్రమములో నివశించ సాగెను'.

'ఓ రాఘవ ! పది సంవత్సరముల వసంతములలో ఆమె విశ్వామిత్రుని ఆశ్రమములో సుఖముగా గడిపెను. అట్లు కాలము గడిచిన పిమ్మట మహాముని అయిన విశ్వామిత్రుడు తపస్సు భంగపడినందుకు చింతాశోకపరాయణుడు అయ్యెను. అప్పుడు ఓ రఘునందన ! ఈ మహత్తరమైన తపస్సు అపహరించుటకు దేవతలు అందరూ చేసిన పని అని విశ్వామిత్రునికి అలోచనవచ్చెను." అహో ఈ అపచారము వలన పది సంవత్సరములు ఒక రాత్రివలే జరిగిపోయినవి" అని చింతించెను.

' విశ్వామిత్రుడు ఈ విధముగా చింతించుచూ పశ్చత్తాపము తో దుఃఖితుడు అయ్యెను. అప్పుడు భయముతో వణుకుచూ అంజలిఘటించిన అప్సరస మేనకను చూచి మధురమైన వచనములతో అమెను పరిత్యజించెను '.

'ఓ రామ ! అప్పుడు విశ్వామిత్రుడు ఉత్తర దిశలో ఉన్న పర్వతమునకు పోయెను'.

'ఆ మహా యశోవంతుడు కామమును జయించుటకు నిశ్చయించుకొని కౌశికీ నదీ తీరములో దారుణమైన తపస్సు నిష్ఠతో చేసెను. ఓ రామా ! ఉత్తరదిశలో పర్వతముపై వేయిసంవత్సరములు ఆచరించిన ఘోరమైన తపస్సు చూచి దేవతలు భయపడిరి. ఆ దేవతలు అందరూ ఋషిగణములతో కలిసి ఈ కౌశికుడు మహర్షి పదము పొందుటకు అర్హుడు అని అనుకొనిరి. సర్వలోక పితామహుడైన బ్రహ్మ ఆ దేవతల మాటలను విని తపోధనుడైన విశ్వామిత్రుని తో మధురమైన మాటలను చెప్పెను."ఓ కౌశిక ! నాయనా ! నీ ఉగ్రమైన తపస్సుతో సంతోషపడితిని. ఓ మహర్షీ ! నీకు స్వాగతము. గొప్పదైన ముఖ్యమైన ఋషిత్వము నీకు ప్రసాదించుచున్నాను"

'అ సర్వలోక మహేశ్వరుడైన బ్రహ్మ వచనములను విని విశ్వామిత్రుడు సంతుష్ఠుడు అవలేదు దుఃఖితుడు అవలేదు'.

'సర్వలోక ముల పితామహునికి అంజలి ఘటించి నమస్కారము చేసి పిమ్మట మహాముని అయిన విశ్వామిత్రుడు సమాధానము చెప్పుచూ ఇట్లు పలికెను. " స్వార్జితమైన శుభకరమగు కర్మలతో సంతుష్టుడై నన్ను మహర్షి అను శబ్దము భగవన్ పలికినచో , అప్పుడు నేను జితేంద్రియుని కదా " అని! అప్పుడు బ్రహ్మ అతనికి మరల చెప్పెను. " ఓ మునిశార్దూల ! జితేంద్రియుడవని భావింపవలదు. ఇంకనూ ప్రయత్నము చేయుము". ఇట్లు చెప్పి తన దేవలోకమునకు పోయెను '.

'దేవతలు అందరూ వెళ్ళిన పిమ్మట, మాహాముని అయిన విశ్వామిత్రుడు ఆలంబనము లేకుండా, బాహువులు పైకి ఎత్తి వాయువునే ఆహారము గా గైకొని తపము ఆచరించెను. వేసవికాలములో పంచ అగ్నులమధ్యలో, వర్షాకాలములో ఆకాశమునే ఆశ్రయముగా చేసుకొని, శిశిరములో నీటిలో నుంచుని ఆ తపోధనుడు రాత్రింబవళ్ళు తపస్సు చేసెను.ఈ విథముగా వెయ్యి సంవత్సరములు ఘోరమైన తపస్సు ఆచరించెను".

మహాముని యగు విశ్వామిత్రుడు అట్లు తపము చేయగా దేవతలు ఇంద్రుడు కూడా మహత్తరమైన సంభ్రమమునకు లోనైరి. అప్పుడు ఇంద్రుడు మరుద్గణములతో కూడి అప్సరస అయిన రంభను తమ హితముకోరకు కౌశికుని అహితము అనగా తపస్సు భంగపరచుటకు చేయమని చెప్పుటకు ఇట్లు పలికెను.

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిషష్టితమస్సర్గః ||

|| ఈ విథముగా రామాయణములో ని బాలకాండలో అరువది మూడవ సర్గము సమాప్తము.

|| ఓమ్ తత్ సత్ ||

రంభాం అప్సరసం శక్రః సర్వైర్మరుద్గణైః |
ఉవాచాత్మహితం వాక్యం అహితం కౌశికస్య చ ||

" మరుద్గణములతో కూడి అప్సరస అయిన రంభను తమ హితముకోరకు కౌశికుని అహితము అనగా తపస్సు భంగపరచుటకు ఇంద్రుడు ఇట్లు పలికెను".

||ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||